జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.
తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం.
బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.
వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.
కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.
జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు
సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే


