టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు హిట్‌మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్‌కు చేరువైంది.
ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్‌మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.
ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?
ఈ సీజన్‌లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్‌లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.
ఇదిలా ఉంటే, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్‌లో చెలరేగిపోతున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.
సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.


