రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి వారి జట్టును గెలిపించుకున్నారు. టీమిండియా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే సవాలక్ష కనిపిస్తున్నాయి.
టాస్‌తో మొదలుపెడితే..
ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకం. గెలిచిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తడి బంతితో బ్యాటర్లను నియంత్రించడం దాదాపు అసాధ్యం.
అందుకే అంతటి భారీ లక్ష్యాన్ని అయినా దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కెప్టెన్ రాహుల్ టాస్ కోల్పోయిన వెంటనే సగం మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే స్వయంగా అంగీకరించాడు.
లోయర్ ఆర్డర్ వైఫల్యం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా టీమిండియా భారీ స్కోరే చేయగలిగింది. వాస్తవానికి ఇంకాస్త భారీ స్కోర్ రావాల్సి ఉండింది. అయితే డెత్ ఓవర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా టీమిండియా పుట్టి ముంచారు.
వీరిద్దరు చాలా నిదానంగా ఆడి అదనంగా రావాల్సిన 20-30 పరుగులకు అడ్డుకట్ట వేశారు. సుందర్ అయితే మరీ దారుణంగా ఆడి 8 బంతుల్లో కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. జడ్డూ.. తానేమీ తక్కువ కాదన్నట్లు 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడుంటే స్కోర్ 380 దాటేది. ఈ స్కోర్ చేసుంటే టీమిండియా డిఫెండ్ చేసుకోగలిగేదేమో.
మంచు ప్రభావం
ముందుగా అనుకున్నట్లుగానే రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది. ఆదిలో కాస్త తక్కువగా ఉన్నా చీకటి పడే కొద్ది దాని ప్రభావం అధికమైంది. దీంతో బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సునాయాసంగా వచ్చాయి. ఫీల్డర్ల వైఫల్యాలు దీనికి అదనం. దేశంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా మిస్ ఫీల్డ్ చేశారు. సెంచరీ వీరుడు మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేయడం భారత ఓటమిని ప్రభావితం చేసింది.
బ్రెవిస్ డ్యామేజ్
బ్రెవిస్ ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణం. ఈ డాషింగ్ బ్యాటర్ వచ్చీరాగానే భారత బౌలర్లపై ఎదురుదాడికి దాగాడు. ఏ బౌలర్‌ను కుదురుకోనివ్వలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని కరిగించాడు.
పైగా అతను క్రీజ్‌లోకి రాగానే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ తప్పిదం చేశాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేశాడని హర్షిత్ రాణాను బరిలోకి దించాడు. అసలే హర్షిత్‌పై కసితో రగిలిపోతున్న బ్రెవిస్‌కు ఇది బాగా కలిసొచ్చింది. హర్షిత్‌తో పాటు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేసిన అనంతరం హర్షిత్ అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?
టీమిండియా మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేదని కేఎల్ రాహుల్ సహా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి సఫారీలు ఉన్న ఊపుకు 380 స్కోర్ కూడా చాలేది కాదు. వాళ్లు లక్ష్యాన్ని ఛేదించాలన్న టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగలేదు.
మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే బరిలోకి దిగారు. ఒకవేళ భారత్ 380 పరుగులు చేసినా వారి లక్ష్యం మారేది కాదు. లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగానే వారికి ఈ విజయం దక్కింది. అది 380 అయినా 420 అయినా వాళ్లు ఓటమినైతే ఒప్పుకునే వారు కాదు. వారి పోరాటాలు ఎలా ఉంటాయో జతమంతా చూసింది.


