దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.
సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..
సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్‌మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.
77 బంతుల్లోనే సెంచరీ
ఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.
మరికొన్నాళ్లపాటు..
సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రుతురాజ్‌ను మేనేజ్‌మెంట్.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది.
తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.
Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN
— Star Sports (@StarSportsIndia) December 3, 2025
చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
ఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరుగగా.. కివీస్‌తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.
మరో రెండు రికార్డులు
ఇక ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.


