రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.
గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే..
"ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్‌లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.
అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి.
రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు.
లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం.


