రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.
ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్‌క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్‌దీప్ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్‌ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.
కోహ్లి, రుతు సెంచరీలు వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది.


