టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 33వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
హార్దిక్‌కు ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లి (124) భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్ సెంచరీ చేయలేదు.
హార్దిక్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్) కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ (175/6) చేయగలిగింది.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది.


