సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.
50- 50 అనుకున్నాం
అనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.
48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేశ్ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.
నమ్మశక్యం కాని విషయం
తొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.
టీ20 క్రికెట్‌లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్‌లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.
అర్ష్‌దీప్, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్ అటాక్ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు.
Hard-hit Pandya is back in business! 🙌💪
Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025
అతడొక అద్భుతం..
నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
టాపార్డర్ విఫలం
కాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (17), శుబ్‌మన్ గిల్ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
ఆదుకున్న హార్దిక్
ఇలాంటి దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రొటిస్ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్


