టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..
భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.
కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్‌మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.
తీయకూడని యాంగిల్‌లో ఫొటో..
‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్‌లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్‌లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.
ప్రైవేట్ మూమెంట్
అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్‌ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్‌లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.
అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.
కాస్త మానవత్వం చూపండి
ప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.
కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.


