ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కెప్టెన్లను ఫైనల్ చేసుకునే పనిలో పడ్డాయి. గత సీజన్ ప్రదర్శనల ఆధారంగా ఈ సీజన్‌లో పలువురు కెప్టెన్ల మార్పు ఉంటుందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ కెప్టెన్ల మార్పు తథ్యమని ఊహించారు.
అయితే ఈ సీజన్‌లోనూ పాత వారితోనే ముందుకు వెళ్లాలని సదరు ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీ అక్షర్ పటేల్‌తో.. కేకేఆర్ అజింక్య రహానేను ఈ సీజన్‌లో కూడా కెప్టెన్లుగా కొనసాగిస్తుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఆశలు
గత సీజన్‌లో రహానే కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సీజన్‌లో అతని మార్పు తప్పదని అంతా భావించారు. ఈ ప్రస్తావన రాగానే జట్టులో సీనియర్లలో ఒకరైన వరుణ్ చక్రవర్తి కెప్టెన్సీపై ఆశలు పెంచుకున్నాడు. తీరా చూస్తే యాజమాన్యం రహానేతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వరుణ్‌కు ఆశాభంగమైంది.
ప్రక్షాళన
2026 సీజన్‌కు ముందు కేకేఆర్ యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఊహించని విధంగా చాలా మంది సీనియర్లను వదిలించుకొని కొత్త వారిని తీసుకుంది. కేకేఆర్ వదిలించుకున్న సీనియర్లలో ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
జాక్‌పాట్ కొట్టిన గ్రీన్
ఈ సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం ఆసీస్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.2 కోట్లు ఖర్చు చేసింది. అలాగే లంక పేసర్ మతీష పతిరణపై రూ. 18 కోట్లు వెచ్చించింది. అలాగే న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్‌ను ఓ మోస్తరు మొత్తాలకు సొంతం చేసుకుంది.
కాగా, ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే ప్రకటించారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు సాగే ఈ విడతతో 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించారు. ఈ దశలో ప్రతి జట్టు తలో 4 మ్యాచ్‌లు ఆడనుంది.
ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.
కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న (ముంబై ఇండియన్స్‌తో) ముంబై వేదికగా ఆడుతుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న ఎస్‌ఆర్‌హెచ్‌తో (కోల్‌కతా), మూడో మ్యాచ్ ఏప్రిల్ 6న పంజాబ్‌తో (కోల్‌కతా), నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 9న లక్నోతో (కోల్‌కతా) ఆడనుంది.
2026 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతియానా, మతీషా పతియానా, మతీషా పతియాన సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్


