ఫైనల్‌పై అమ్మాయిల గురి | Indias semi final clash with Italy today | Sakshi
Sakshi News home page

ఫైనల్‌పై అమ్మాయిల గురి

Mar 13 2026 1:43 AM | Updated on Mar 13 2026 1:43 AM

Indias semi final clash with Italy today

నేడు ఇటలీతో భారత్‌ సెమీస్‌ పోరు  

ప్రపంచకప్‌ హాకీ క్వాలిఫయర్స్‌ 

రా.7.30 నుంచి ‘హాట్‌స్టార్‌’లో ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: హాకీ ప్రపంచకప్‌–2026కు ఇప్పటికే అర్హత సాధించిన భారత మహిళల జట్టు క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరడంపై దృష్టి పెట్టింది. టోర్నీ లో భాగంగా నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌ పోరులో ఇటలీతో భారత్‌ తలపడుతుంది.  చీఫ్‌ కోచ్‌గా జోయెర్డ్‌ మరీన్‌ పునరాగమనంతోనే మన అమ్మాయిల జట్టు ఘన విజయాలు సాధిస్తోంది. పూల్‌ ‘బి’లో ఉన్న భారత్‌ లీగ్‌ దశను అగ్ర స్థానంతో ముగించింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒక డ్రా ఫలితంతో 7 పాయింట్లు సాధించింది. 

అయితే స్కాట్లాండ్‌ కూడా 7 పాయింట్లతో ఉన్నప్పటికీ గోల్స్‌ తేడాతో రెండో స్థానంలో ఉంది. తాజా సెమీస్‌లో ఎదురుపడుతున్న ఇటలీ ఈ టోర్నీ లో మనలాగే అత్యంత నిలకడను ప్రదర్శించింది. అటాకింగ్‌లో ఫెడెరికా కార్టా అసాధారణ నైపుణ్యం కనబరిచింది. ఆమె మూడు గోల్స్‌ సాధించింది. 2012 నుంచి ఇప్పటివరకు భారత్, ఇటలీ జట్లు ఏడుసార్లు ముఖాముఖీగా తలపడితే... భారత్‌ ఐదింట గెలుపొందింది. 

ఇటలీ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్‌ విజయంతో సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్‌ హాకీ ఈవెంట్‌  పురుషుల ప్రపంచకప్‌తో పాటే జరుగనుంది. ఈ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ఈ రెండు మెగా ఈవెంట్లకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 

అర్హత సాధించిందిలా... 
హైదరాబాద్‌తో పాటు చిలీలోని సాంటియాగోలో కూడా మరో వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ జరుగుతోంది. ఈ రెండు టోర్నమెంట్‌ల ద్వారా మొత్తం 7 జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. టాప్‌–3 స్థానాల్లో నిలిచిన ఆరు టీమ్‌లు క్వాలిఫై అవుతాయి. దీంతో పాటు రెండు టోర్నీ ల్లో నాలుగో స్థానాల్లో నిలిచిన రెండు జట్ల మధ్య వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఎవరు మెరుగైన స్థానంలో ఉంటే వారికి అవకాశం దక్కుతుంది. 

భారత్‌ ఒక వేళ ఫైనల్‌ చేరకపోయినా మూడో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది.  ఆ మ్యాచ్‌లోనూ ఓడితే నాలుగో స్థానం దక్కుతుంది. మరో వైపు చిలీలో టోర్నీ లో జపాన్‌ నాలుగో స్థానంతో ముగించింది. ప్రస్తుతం భారత్‌ 9వ ర్యాంక్‌లో, జపాన్‌ 15వ ర్యాంక్‌లో ఉన్నాయి. కాబట్టి బుధవారం చివరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాతే భారత్‌ వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement