భారత్‌ శుభారంభం | Indian team beats Uruguay in Womens Hockey World Cup Qualifying Tournament | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Mar 9 2026 4:08 AM | Updated on Mar 9 2026 4:08 AM

Indian team beats Uruguay in Womens Hockey World Cup Qualifying Tournament

తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేపై విజయం

సాక్షి, హైదరాబాద్‌: మహిళల ప్రపంచకప్‌ హాకీ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన పూల్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 4–0 గోల్స్‌ తేడాతో ఉరుగ్వేను ఓడించింది. భారత్‌ తరఫున సునెలితా టొప్పో (21వ నిమిషంలో), ఇషిక (40వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (49వ నిమిషంలో), రుతుజా ఫాల్కే (58వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు రాగా... ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మిగతా ఐదింటిని వృథా చేసింది. ఉరుగ్వే తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన ఇతర మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ 5–2 గోల్స్‌ తేడాతో ఇటలీ జట్టుపై, దక్షిణ కొరియా 1–0తో ఆ్రస్టియాపై, స్కాట్లాండ్‌ 1–0తో వేల్స్‌ జట్టుపై విజయం సాధించాయి. భారత్, ఉరుగ్వే మ్యాచ్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్, తెలంగాణ రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్‌ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ శివసేనా రెడ్డి, ‘శాట్స్‌’ ఎండీ సోనీబాలా దేవి, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కి, కార్యదర్శి భోళానాథ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ఇటలీతో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఇంగ్లండ్‌ (మధ్యాహ్నం గం. 3 నుంచి), ఉరుగ్వేతో వేల్స్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), స్కాట్లాండ్‌తో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement