2024 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల్లో 9 మంది ఈసారీ విన్నింగ్ టీమ్‌లో భాగంగా ఉండి కెరీర్‌లో రెండు టి20 వరల్డ్ కప్‌లు గెలుచుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు. సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లకు ఇది రెండో టి20 వరల్డ్ కప్ విక్టరీ. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలకు ఇది తొలి తీపి వరల్డ్ కప్. 2024లో కెప్టెన్ అయిన రోహిత్ శర్మ 2007లో గెలిచిన జట్టులో సభ్యుడిగా ‘డబుల్’ ఆనందాన్ని పొందాడు.
పురుషుల దినోత్సవాన చేజారింది... మహిళల దినోత్సవాన దక్కింది...
2023 నవంబర్ 19న భారత జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆ్రస్టేలియాతో చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడి తీవ్ర నిరాశకు గురైంది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘మెన్స్ డే’గా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ‘ఉమెన్స్ డే’ (మార్చి 8న) రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి విశ్వవిజేతగా నిలవడం విశేషం.
ఎట్టకేలకు ఆదివారం ‘గెలిచాం’
గతంలో ఆదివారం రోజు జరిగిన మూడు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత జట్టు ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. నాలుగోసారి మాత్రం ‘సండే ఫైనల్ సెంటిమెంట్’ను బద్దలు కొట్టింది. ఆదివారం రోజు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో తొలిసారి భారత్ విజేతగా నిలిచింది.
ఆదివారం రోజు జరిగిన 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో... 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో... 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా... ఈసారి మాత్రం ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించి ఆదివారం అద్భుతం సాధించింది. గతంలో భారత్ గెలిచిన 1983, 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ శనివారం రోజున, 2007 టి20 వరల్డ్‌కప్ టైటిల్ సోమవారం రోజున... 2024 టి20 వరల్డ్‌కప్ టైటిల్ శనివారం రోజున వచ్చాయి.


