మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ బరిలో భారత్
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో జరిగే మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు మిడ్‌ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సీనియర్ స్టార్ గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా కుటుంబ కారణాలరీత్యా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
ఈనెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్‌తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌ను 8న ఉరుగ్వేతో, తర్వాత 9న స్కాట్లాండ్‌తో, 11న వేల్స్‌తో తలపడుతుంది. ఈ టోర్నీ ద్వారా మూడు జట్లు ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
భారత మహిళల హాకీ జట్టు: బన్సారి, బిచ్చూ దేవి (గోల్‌కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, సలీమా టెటె, సునెలితా టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి, రుతుజా, దీపిక (మిడ్‌ఫీల్డర్లు), నవ్‌నీత్ కౌర్, ఇషిక, లాల్‌రెమ్‌సియామి, బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను (ఫార్వర్డ్స్).


