చివరి లీగ్ మ్యాచ్‌లో వేల్స్‌పై ఘనవిజయం
నవ్‌నీత్ కౌర్ హ్యాట్రిక్
రేపు సెమీఫైనల్లో ఇటలీతో టీమిండియా ‘ఢీ’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ హాకీ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు భారత మహిళల జట్టు గెలుపు దూరంలో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో బుధవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 4–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది. మరో గోల్‌ను సాక్షి రాణా (7వ నిమిషంలో) అందించింది. వేల్స్ జట్టు తరఫున బెట్సాన్ థామస్ (39వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది.
నవ్‌నీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో రెండింటిని, పెనాల్టీ స్ట్రోక్‌ను నవ్‌నీత్ కౌర్ గోల్స్‌గా మలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు ఏడు పాయింట్లతో పూల్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. భారత్‌తోపాటు స్కాట్లాండ్ కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది.
అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కగా... స్కాట్లాండ్‌కు రెండో స్థానం లభించింది. స్కాట్లాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 3–1తో ఉరుగ్వేపై గెలిచింది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2–0తో ఆస్ట్రియా జట్టుపై గెలుపొందగా... కొరియాతో మ్యాచ్‌ను ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్ 9 పాయింట్లతో పూల్ ‘ఎ’లో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇటలీ, కొరియా 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన గోల్స్ సగటుతో ఇటలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఇటలీతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. ఫైనల్ చేరుకునే రెండు జట్లకు శుక్రవారమే ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారవుతాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య శనివారం మూడో స్థానం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది.


