బెంగళూరు X హైదరాబాద్‌ | IPL tournament starts from March 28th | Sakshi
Sakshi News home page

బెంగళూరు X హైదరాబాద్‌

Mar 12 2026 2:15 AM | Updated on Mar 12 2026 2:15 AM

IPL tournament starts from March 28th

మార్చి 28 నుంచి ఐపీఎల్‌ టోర్నీ

బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్‌సీబీతో సన్‌రైజర్స్‌ పోరు

ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో మ్యాచ్‌

తొలి దశ 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: తాజా టి20 ప్రపంచకప్‌ విజయోత్సాహంతో అటు టీమిండియా, ఇటు యావత్‌ భారతావని ఊగిపోతోంది. ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న అభిమానులకు మరోవైపు నుంచి వేసవి మజాను పంచేందుకు ఐపీఎల్‌ సీజన్‌ కూడా ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి షెడ్యూల్‌ కాదు. 

ఇరాన్‌పై యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్రకటించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక పూర్తి సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 నుంచి ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఆరంభమవుతుంది. 

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ వేడుకలతో పాటు ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఇక హైదరాబాద్‌లో తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న సన్‌రైజర్స్, లక్నో జట్ల మధ్య జరుగనుంది. ఏప్రిల్‌ 12 వరకు జరిగే తొలి దశ 20 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌నే హైదరాబాద్‌కు కేటాయించారు. 

బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, గువాహటి, ముల్లాన్‌పూర్‌ వేదికలపై రెండేసి మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రారంభ శని, ఆదివారాల్లో ఒకే మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. తర్వాతి వారాంతాల్లో రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) జరుగుతాయి. గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట వల్ల 11 మంది మృతి చెందడంతో కర్ణాటక సర్కారు చిన్నస్వామి స్టేడియంపై నిషేధాన్ని విధించింది. 

అయితే ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తేసిన సర్కారు నిపుణుల కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ స్టేడియంలోని సదుపాయాలు, ఏర్పాట్లను సమీక్షించి పూర్తిస్థాయి అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement