సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్ దేశవాలీ అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం పొందాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్.. ఏమిటా స్టోరీ..?
బరోడాకు చెందిన 26 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ అమిత్ పాసి తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిన్ననే తన దేశవాలీ అరంగేట్రం (టీ20) చేశాడు. తొమ్మిదేళ్లు నిరీక్షించినందుకు అతనికి మంచి ప్రతిఫలమే దక్కింది. తొలి మ్యాచ్‌లోనే (SMATలో సర్వీసెస్‌పై) వరల్డ్ రికార్డు సెంచరీ చేశాడు.
టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (2015) ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాసి, బిలాల్ ఇద్దరూ టీ20 అరంగేట్రాల్లో 114 పరుగులు చేశారు. టీ20 అరంగేట్రంలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురుచూసినా ఫలితం దక్కకపోవడంతో పాసి ఓ దశలో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్ వైపు మళ్లాలని అనుకున్నాడు. కొద్ది రోజులు ఆ ప్రయత్నం కూడా చేశాడు. జితేశ్ శర్మ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో ఎట్టకేలకు పాసి కల నెరవేరింది.
అరంగేట్రం మ్యాచ్‌తోనే హీరో అయిపోయాడు. 24 బంతుల్లో అర్ద సెంచరీ చేసి కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.
పాసి ఉదంతం క్రీడలో అయినా జీవితంలో అయినా నిరీక్షణ అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఎదురుచూసే వారికి పాసికి వచ్చినట్లే అవకాశాలు వస్తాయి. పాసికి 2016–17 సీజన్‌లో బరోడా అండర్–19 జట్టులో చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
ప్రతి సీజన్‌లో జట్టుకు ఎంపికైనా, తుది పదకొండులో అవకాశాలు రాలేదు. స్థానిక స్థాయిలో నిరంతరం రాణించినా, సీనియర్ స్థాయి అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.
పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ ప్రోత్సాహంతో పాసి ఆశ కోల్పోకుండా నిరంతర ప్రయత్నం చేశాడు. పాండ్యా సోదరులు పాసి గురించి తెలిసి ఎదురుపడిన ప్రతిసారి ధైర్యం చెప్పేవారు. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలని హార్దిక్ ఇచ్చిన సలహా అతనికి ప్రేరణగా నిలిచింది.
ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ధోనిని ఆరాధించే పాసి, అతనిలాగే దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్ చేస్తాడు. పాసి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి నాలుగు దశాబ్దాల క్రితం వడోదరాకు వలస వెళ్లింది.
అతని కుటుంబానిది గుజరాత్‌లో నీటి సరఫరా చేసే వ్యాపారం. ఆర్థికంగా పాసికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అతడి అన్నయ్య కూడా స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ప్రస్తుతం అతను కూడా కుటుంబ వ్యాపారంలో భాగంగా ఉన్నాడు.
మొత్తంగా చూస్తే పాసి ఉదంతం అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసే వారికి ఓ ప్రేరణగా నిలుస్తుంది. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఉంటే ఒకే ఇన్నింగ్స్ జీవితాన్ని మార్చేస్తుందని పాసి కథ సూచిస్తుంది.


