ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్‌కు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు.
దీంతో తన బౌలింగ్ స్పెల్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పలు స్కాన్ల తర్వాత అతడికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.
అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్-19 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. హర్షిత్ తన ఐపీఎల్(2022) తన అరంగేట్రం నుంచి కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో కూడా హర్షిత్ 15 వికెట్లతో సత్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా తరపున కూడా అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచాడు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం గాయం కారణంగా దూరమయ్యే అవకాశముంది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో పతిరానను రూ.18 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పతిరాన కూడా గాయపడ్డాడు. అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.
చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్.. క్రికెట్ చరిత్రలోనే!


