పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే! | Salman Ali Agha Controversial Run Out In PAK Vs BAN 2nd ODI Leads To Heated Exchange With Bangladesh Players, Video Went Viral | Sakshi
Sakshi News home page

BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!

Mar 13 2026 7:46 PM | Updated on Mar 13 2026 8:21 PM

Was Salman Ali Agha Run-Out Fair In PAK vs BAN 2nd ODI?

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మాజ్ సదాకత్(75), ఫర్హాన్‌(31) మంచి ఆరంభం ఇచ్చారు.

ఆ తర్వాత పాక్ వెంటవెంటే మూడు వికెట్లు కోల్పోయి బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్లు సల్మాన్ అలీ అఘా(64), మహ్మద్ రిజ్వాన్‌(44) నిలకడగా ఆడి తమ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే పాక్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మోహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సల్మాన్ అలీ ఊహించని విధంగా ఔటయ్యాడు.

ఏమి జరిగిందంటే?
ఆ ఓవర్‌లో మెహదీ వేసిన నాలుగో బంతిని మహమ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అలీ ఆఘా బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలోనే బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి బౌలర్‌కు ఇవ్వబోయాడు. కానీ అదే సమయంలో బంతిని అందుకున్న మిరాజ్ స్టంప్స్‌ను గిరాటేశాడు.

వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. స్టంప్స్ కిందపడే సమయానికి సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. సల్మాన్ అలీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే తన గ్లౌవ్స్‌, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.

అంతేకాకుండా బంగ్లా కెప్టెన్ మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌తో సల్మాన్ వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌లు జోక్యంతో చేసుకోవడంతో సల్మాన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

రూల్స్ ఏమి చెబుతున్నాయి?
బంతి లైవ్‌లో ఉన్న‌ప్పుడు బ్యాట‌ర్ బంతిని బ్యాట్‌తో కానీ చేతితో కానీ ట‌చ్ చేయ‌కూడ‌దు. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ కావాలని బంతిని తాకినా లేదా ఫీల్డర్‌ను అడ్డుకున్నా‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ గా పరిగణిస్తారు. ఒకవేళ మిరాజ్ స్టంప్స్ పడగొట్టకుండా.. ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అప్పీల్‌ చేసినా సల్మాన్‌ ఔటయ్యే వాడు. ఎందుకంటే అప్పటికే సల్మాన్‌ క్రీజుకు సుమారు ఒక అడుగు దూరంలో ఉండి, బంతిని బౌలర్‌కు అందించడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement