’నా చిన్ని తమ్ముడు.. ఇకపై ఆమెకు మాత్రమే సొంతం’ | My Baby Brother Now Belongs To Her: Sara Tendulkar Post Goes Viral | Sakshi
Sakshi News home page

’నా చిన్ని తమ్ముడు.. ఇకపై ఆమెకు మాత్రమే సొంతం’

Mar 13 2026 6:12 PM | Updated on Mar 13 2026 6:32 PM

My Baby Brother Now Belongs To Her: Sara Tendulkar Post Goes Viral

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కొత్త కోడలి రాకతో పరివారంలో సందడి నెలకొంది. ఈ క్రమంలో సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌- మరదలు సానియా చందోక్‌లను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సానియా పాపిట్లో అర్జున్‌ తిలకం దిద్దుతున్న ఫొటోను పంచుకున్న సారా.. ‘‘నా చిన్ని తమ్ముడు.. ఇకపై సానియాకే సొంతం. ఈ విశ్వం మీపై అంతులేని ప్రేమ, ఆశీర్వచనాలు కురిపించాలి. మీ హృదయం కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కాలి.

మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మీ ఇద్దరిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజు మీ పెళ్లి రోజే అని చెప్పడంలో సందేహంలేదు’’ అని తమ్ముడు, మరదలిపై ప్రేమను కురిపించింది. తనకు సోదరిలేని లోటు తీర్చేలా సానియాను ఇచ్చినందుకు అర్జున్‌కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు కూడా తెలిపింది.

కాగా సచిన్‌- అంజలి దంపతుల ఏకైక కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం మార్చి 5న సానియా చందోక్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకు భారత క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్ర సింగ్‌ ధోని, గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు సతీసమేతంగా తరలివచ్చారు. ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించింది.

ఇదిలా ఉంటే.. తమ్ముడి పెళ్లిలో సారా కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సంగీత్‌, మెహందీ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సారా టెండుల్కర్‌ మరింత అందంగా కనిపించింది. 

ఇక అర్జున్‌- సానియా సంగీత్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. వారి పట్ల మరోసారి సారా ప్రేమ చూపగా.. సానియా ఇందుకు.. ‘‘ధన్యవాదాలు.. లవ్‌ యూ సోదరి’’ అంటూ జవాబు ఇచ్చింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా. ఆమె కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement