భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు | Not Just Abrar: Pak Stars Playing In Indian Owned T20 Franchises List | Sakshi
Sakshi News home page

భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

Mar 13 2026 5:05 PM | Updated on Mar 13 2026 5:21 PM

Not Just Abrar: Pak Stars Playing In Indian Owned T20 Franchises List

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్‌ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఉక్కుపాదం మోపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, పాక్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.

కరచాలనానికి నిరాకరించి
ఇందుకు ప్రతిగా పాక్‌ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌-2025లో భారత క్రికెట్‌ జట్టు పాక్‌ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్‌ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.

మొట్టికాయలు వేసిన ఐసీసీ
అదే విధంగా టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాక్‌ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.

చెలరేగిన వివాదం
అయినా సరే బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాక్‌ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్‌ లీగ్‌-2026’ వేలంలో సన్‌ గ్రూపునకు చెందిన కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.

టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేస్తూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్‌ కోసం సన్‌రైజర్స్‌ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్‌ (ఇంగ్లండ్‌)’ విదేశీ లీగ్‌ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. 

సన్‌రైజర్స్‌ తాజాగా విదేశీ లీగ్‌లో పాక్‌ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్‌ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..

భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు
👉పాకిస్తాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌, టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో తన బౌలింగ్‌ యాక్షన్‌తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమానులైన షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.

👉ఇక అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MCL)లో గతేడాది పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం సీటెల్‌ ఆర్కాస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్‌నకు చెందినది. 

👉కాగా ఇమాద్‌ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్‌కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్‌ మరో క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్‌ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ కొనగా.. మరో పాక్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫొనిక్స్‌ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్‌ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్‌ ఆయుబ్‌, హ్యారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వంటి వాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 

చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement