ఐపీఎల్-2026 సీజన్ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
అతడికి పవర్‌ప్లేతో డెత్ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.
ముస్తాఫిజుర్‌పై వేటు..
కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ సూచింది.
బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.
కేకేఆర్ పూర్తి జట్టు:
అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.
చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు


