‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’ | Iran withdraws from FIFA World Cup over safety concerns | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’

Mar 14 2026 4:22 AM | Updated on Mar 14 2026 4:22 AM

Iran withdraws from FIFA World Cup over safety concerns

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఇరాన్‌ స్పష్టీకరణ 

జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని ఇరాన్‌ జట్టు ప్రకటించింది. ఇరాన్‌ ఆటగాళ్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేం అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. నిజంగా వరల్డ్‌ కప్‌ నుంచి ఎవరినైనా తప్పించాలంటే అది ఆతిథ్య అమెరికానేనని ఇరాన్‌ బృందం అభిప్రాయ పడింది. గల్ఫ్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌–జూలైలో అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌లో ఇరాన్‌ పాల్గొనడం సందేహంగా మారింది.

లీగ్‌ దశలో ఇరాన్‌ తమ మూడు మ్యాచ్‌లు కూడా అమెరికా వేదికగానే ఆడాల్సి ఉంది.  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్‌ వరుసగా నాలుగోసారి వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై అయింది. అయితే ఇరాన్‌ టీమ్‌ గురించి మాట్లాడుతూ... ‘ఆ జట్టు ఇక్కడికి వచ్చి ఆడుతుందని నేను అనుకోవడం లేదు. వారి భద్రత, జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇరాన్‌ టీమ్‌ స్పందిస్తూ... ‘వరల్డ్‌ కప్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్‌.

ఇది ‘ఫిఫా’ ఆధ్వర్యంలో జరుగుతుందే తప్ప ఏదో ఒక దేశం నిర్వహించడం లేదు. కాబట్టి వరల్డ్‌ కప్‌ ఆడకుండా ఇరాన్‌ను ఎవరూ తప్పించలేరు. ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం చేతకాదని చెబుతున్న అమెరికానే నిజానికి తప్పించాలి’ అని ట్వీట్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement