భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం! | Young Football Player Ravinder Singh Died Heart Attack In Punjab | Sakshi
Sakshi News home page

భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!

Mar 13 2026 10:42 AM | Updated on Mar 13 2026 1:29 PM

Young Football Player Ravinder Singh Died Heart Attack In Punjab

భారత్‌ ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్‌బాల్‌ ఆటలో మంచి భవిష్యత్తు ఉన్న యంగ్‌ డిఫెండర్‌ రవీందర్‌ సింగ్‌ 25 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడడం కలచివేసింది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామానికి చెందిన రవీందర్‌ సింగ్‌ లోకల్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు.

వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. రవీందర్‌ సింగ్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం రవీందర్‌ సింగ్‌  నమ్దారీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత ఫుట్‌బాల్‌ జట్టులోకి ప్రవేశం పొందేందుకు ఈ క్లబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న రవీందర్‌ సింగ్‌  2000వ సంవత్సరంలో జన్మించాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న రవీందర్‌  ప్రస్తుతం ఘర్షంకర్‌లోని బబ్బర్‌ అకాలీ మొమోరియల్‌ ఖల్సా కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

కాగా రవీందర్ సింగ్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు సహా స్నేహితులు, ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌కు చెందిన పలు క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు భారీగా హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లోనూ రవీందర్‌సింగ్‌ మృతి పట్ల నివాళులు వెల్లువెత్తాయి. 

రవీందర్‌సింగ్‌ మృతిపై నమ్దారీ ఫుట్‌బాల్‌ క్లబ్ ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ‘మా ఫుట్‌బాల్‌ క్లబ్‌లో భాగమైన ఆటగాడు మరణించడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న రవీందర్‌ సింగ్‌ 25 ఏళ్లకే మృతి చెందడం కలచివేస్తోంది. అతని అకాల మరణం ఫుట్‌బాల్‌ ఫ్యామీలీకి తీరని లోటు. రవీందర్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. 

ఈ సందర్భంగా నమ్దారీ స్పోర్ట్స్‌ తరఫున ఆటగాళ్లు,కోచ్‌, సిబ్బంది నివాళి అర్పిస్తున్న వీడియోను షేర్‌ చేసుకుంది. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ సహా ఇతర ఫుట్‌బాల్‌ క్లబ్‌లు కూడా రవీందర్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించాయి.

చదవండి: పాక్‌ ఆటగాడి కొనుగోలు.. కావ్యా మారన్‌కు భారీ ఝలక్‌

Advertisement
 
Advertisement
Advertisement