ఈనెల 16న అబుదాబిలో ఐపీఎల్ వేలం
77 స్థానాల కోసం పోటాపోటీ
చివరి నిమిషంలో వేలంలోకి వచ్చిన డికాక్
గ్రీన్, కాన్వే, ఇన్‌గ్లిస్, లివింగ్‌స్టోన్‌లపై అందరి దృష్టి
పృథ్వీ షా, సర్ఫరాజ్‌లకు చాన్స్ దక్కేనా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన వేలం కార్యక్రమంలో పాల్గొనే ప్లేయర్ల జాబితా సిద్ధం అయింది. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది. 77 స్థానాల కోసం మొత్తం 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు కాగా... 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంఛైజీలు కలిసి గరిష్టంగా 77 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 విదేశీ ప్లేయర్ల స్థానాలు కాగా... 46 భారత ఆటగాళ్లవి.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి నిమిషంలో వేలం జాబితాలోకి రాగా... ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వే, భారత ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి వాళ్లు వేలం జాబితాలో ఉన్నారు.
మొదట 1390 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోగా... అందులో ఫ్రాంచైజీల ఆసక్తి మేరకు 350 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఒక్కో సెట్‌లో పది మంది చొప్పున 35 సెట్‌ల పాటు వేలం సాగనుంది. ఈ జాబితాలో 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అత్యధిక ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో మొత్తం 40 మంది వేలంలో ఉండగా... ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో 227 మంది పోటీలో ఉన్నారు.
» టీమిండియా ప్లేయర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ తమ ప్రాథమిక ధరను రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నారు. పృథ్వీ షా 2018 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడగా... 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో అతడిని ఏ జట్టూ తీసుకోలేదు. ఇక సర్ఫరాజ్ 2021 సీజన్ నుంచి ఐపీఎల్ ఆడలేదు.
» 2025 సీజన్‌కు ముందు రికార్డు స్థాయిలో రూ. 23.75 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. అతడు ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో వేలానికి రానున్నాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణిస్తున్న కునాల్ చండేలా, అశోక్ కుమార్‌లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి.
» పది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ దగ్గర రూ. 64.3 కోట్లు అందుబాటులో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ రూ. 43.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 25.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
» వేలంలో ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా 21 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో జేమీ స్మిత్, అట్కిన్సన్, లివింగ్‌స్టోన్, బెన్ డకెట్ వంటి వారు ఉన్నారు.
» ఆ్రస్టేలియా పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం అన్నీ ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. గ్రీన్, స్మిత్‌తో పాటు ఇన్‌గ్లిస్, షార్ట్, కూపర్, వెబ్‌స్టర్ వంటి 19 మంది ప్లేయర్లు ఆ్రస్టేలియా నుంచి ఈ వేలం బరిలో ఉన్నారు.
» డికాక్, మిల్లర్‌లతో పాటు దక్షిణాఫ్రికా నుంచి 15 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో నోర్జే, ఎంగిడి, కోట్జీ, ముల్డర్ తదితరులు ఉన్నారు.
» వెస్టిండీస్ నుంచి అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ సహా 9 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు.
» శ్రీలంక నుంచి హసరంగ, దునిత్ వెల్లలాగె, తీక్షణ, నిసాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా సహా 12 మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
» న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, కాన్వే సహా మొత్తం 16 మంది ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు.
» అఫ్గానిస్తాన్ నుంచి రహ్మనుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్ సహా మొత్తం 10 మంది ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.
అంకెల్లో...
వేలంలో ఉన్న మొత్తం ఆటగాళ్లు 350
భారత క్యాప్డ్ ఆటగాళ్లు 16
విదేశీ క్యాప్డ్ ఆటగాళ్లు 96
భారత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు 224
విదేశీ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు 14
ప్రాథమిక ధర ఆటగాళ్ల సంఖ్య
రూ. 2 కోట్లు 40
రూ. 1.50 కోట్లు 9
రూ. 1.25 కోట్లు 4
రూ. 1 కోటి 17
రూ. 75 లక్షలు 42
రూ. 50 లక్షలు 4
రూ. 40 లక్షలు 7
రూ. 30 లక్షలు 227


