ఈ నెల 21న ‘ప్రపంచ 25కె రన్’
బరిలో 23 వేల పైచిలుకు రన్నర్లు
కోల్‌కతా: టాటా స్టీల్ ప్రపంచ 25 కిలోమీటర్ల రన్‌కు దిగ్గజాలు కూడా సై అంటున్నారు. ఈ 25 కిలోమీటర్ల పరుగులో ఇప్పటికే 23 వేల మంది పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, మరో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జొషువా చెప్టెగయ్ (ఉగాండా) కూడా కోల్‌కతా ఈవెంట్‌లో పరుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మహిళల డిఫెండింగ్ చాంపియన్ సుతుమ్ అసిఫా కెబెడే సైతం 25కె రన్‌పై ఆసక్తి కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 21న ఈ రేసు జరుగుతుందని ప్రమోటర్స్ ప్రొకామ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వరకు నమోదైన 1 గంటా 11.08 నిమిషాల రికార్డును బ్రేక్ చేసిన రన్నర్‌కు ప్రైజ్‌మనీకి అదనంగా 25 వేల డాలర్లు (రూ.22.46 లక్షలు) బోనస్‌గా అందజేస్తామని ప్రోకామ్ సంస్థ తెలిపింది. కాగా ఈవెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 1,42, 214 డాలర్లు (రూ.కోటి 28 లక్షలు). ఈ మొత్తాన్ని మహిళలు, పురుషుల విజేతలకు సమానంగా బహూకరించనున్నారు.
29 ఏళ్ల ఉగాండ రన్నర్ చెప్టెగయ్ సుదీర్ఘ పరుగు పందెంలో ఎదురేలేని చాంపియన్. మూడుసార్లు 10 వేల మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. 5కె, 10కె పరుగులు కలుపుకొని నాలుగుసార్లు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. గతేడాది ఢిల్లీ హాఫ్ మారథాన్, ఈ ఏడాది బెంగళూరులో జరిగిన వరల్డ్ 10కె రన్‌లోనూ ఈ ఉగాండా రన్నర్ విజేతగా నిలిచాడు. తొలిసారిగా భారత్‌లో 25కె రన్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
పురుషుల విభాగంలో చెప్టెగయ్‌తో పాటు అల్ఫొన్స్ ఫెలిక్స్ సింబు (టాంజానియా) సహా ఇథియోపియన్ రన్నర్ హేమనొట్ అలివ్, లెసోతొకు చెందిన టెబెలో రమకొంగొన తదితర మేటి అథ్లెట్లు కోల్‌కతా ఈవెంట్‌కు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇథియోపియన్ మహిళా రన్నర్ అసిఫా కెబెడె పదేళ్ల క్రితమే 25కె పరుగులో ప్రపంచ రికార్డు సృష్టించింది. బెర్లిన్‌లో 2015లో జరిగిన ఆ ఈవెంట్‌లో రికార్డు నెలకొల్పిన ఆమె 2023లో కోల్‌కతాలో జరిగిన ఈవెంట్‌లోనూ మరో రికార్డు సాధించింది. మేటి అథ్లెట్లు పాల్గొననుండటంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.


