క్యూ2లో రూ. 3,183 కోట్లు
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 3,183 కోట్లను అధిగమించింది. దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 759 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 59,053 కోట్లను తాకింది. గత క్యూలో రూ. 54,503 కోట్ల టర్నోవర్ అందుకుంది. నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌సహా దేశీయంగా రూ. 38,592 కోట్ల అమ్మకాలు సాధించింది. ఈ కాలంలో టారిఫ్ అనిశి్చతులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు తదితర అంశాలు సవాళ్లు విసిరినట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. అయినప్పటికీ పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం నీరసించి రూ. 179 వద్ద ముగిసింది.


