
క్యూ2లో 10 శాతం అప్
మెరుగుపడిన ఎన్‌పీఏల నిష్పత్తి
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత క్యూ2తో పోలిస్తే బ్యాంకు నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 10 శాతం పైగా పెరిగి రూ. 19,611 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం సుమారు 11 శాతం పెరిగి రూ. 18,641 కోట్లుగా నమోదైంది.
ఇక రుణాల్లో 10 శాతం వృద్ధి దన్నుతో నికర వడ్డీ ఆదాయం 4.8 శాతం ఎగిసి రూ. 31,550 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) మాత్రం 3.5 శాతం నుంచి 3.27 శాతానికి నెమ్మదించింది. రాబోయే ఒకటి రెండేళ్లలో ఇది స్థిరంగా కొనసాగవచ్చని, లేదా మరింతగా పెరగొచ్చని బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.36 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది.
లక్ష్యాల వైపు ముందుకు..
క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తిని 96 శాతానికి పరిమితం చేసుకోవడం, రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవడంలాంటి గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు బ్యాంకు ఎండీ శశిధర్ జగదీశన్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు మించి రుణ వృద్ధి సాధించగలమని, మార్కెట్ వాటాను పెంచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ, ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆర్‌బీఐ రేట్ల కోత తదితర పాలసీలపరమైన అంశాల దన్నుతో క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు లభించగలవని జగదీశన్ తెలిపారు. కంపెనీల కొనుగోళ్ల లావాదేవీలకు నిధులు సమకూర్చేలా (ఎక్విజిషన్ ఫైనాన్స్) బ్యాంకులకు అనుమతి లభించడం ఇటు బ్యాంకర్లకు, అటు రుణగ్రహీతలకు మేలు చేసే విషయమని సీఈవో శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు.
దీనితో కార్పొరేట్లకు లావాదేవీల వ్యయాల భారం తగ్గుతుందన్నారు. తాము కూడా ఎక్విజిషన్ ఫైనాన్స్ కార్యకలాపాలు చేపట్టే దిశగా తుది మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని వైద్యనాథన్ వివరించారు. ఉద్యోగాలపై జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఉంటుందని భావించడం లేదని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీల రాకతో కొందరు సిబ్బంది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి మారొచ్చని తెలిపారు. జనరేటివ్ ఏఐ సహా వివిధ టెక్నాలజీలపై బ్యాంకు అంతర్గతంగా కొన్ని ప్రయోగాలు చేస్తోందన్నారు.
మరిన్ని విశేషాంశాలు..
→ సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల స్లిపేజీలు రూ. 7,400 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 1,100 కోట్లు వ్యవసాయ రుణాలున్నాయి.
→ మొత్తం ప్రొవిజన్లు రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెరిగాయి. అయితే, అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన రూ. 14,441 కోట్లతో పోలిస్తే తగ్గాయి.
→ రిటైల్ రుణాలు 7.4 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్ మార్కెట్ సంస్థలకు రుణాలు 17 శాతం, కార్పొరేట్..హోల్‌సేల్ రుణాలు 6.4 శాతం పెరిగాయి.
→ వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 6.4 శాతం పెరిగి రూ. 17,980 కోట్లుగా నమోదయ్యాయి.