 
													క్యూ2లో రూ. 5,187 కోట్లు
కోల్‌కతా: డైవర్సిఫైడ్ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌లో నికర లాభం 3% వృద్ధితో రూ. 5,187 కోట్లకు చేరింది. జీఎస్‌టీ సవరణలు, అధిక వర్షాల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ విభాగం సవాళ్లు ఎదుర్కొంది.
గతేడాది ఇదే కాలంలో రూ. 5,054 కోట్లు ఆర్జించింది. ఇబిటా స్వల్పంగా(2%) బలపడి రూ. 6,695 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 21,536 కోట్ల నుంచి రూ. 21,256 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌ను డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2026 జనవరి నుంచి కాంత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 
ఎఫ్‌ఎంసీజీ గుడ్ 
క్యూ2లో సిగరెట్లుసహా బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతోకూడిన ఎఫ్‌ఎంసీజీ విభాగం ఆదాయం 7% పుంజుకుని రూ. 15,473 కోట్లను అధిగమించినట్లు ఐటీసీ వెల్లడించింది. అగ్రి బిజినెస్ ఆదాయం రూ. 5,845 కోట్ల నుంచి రూ. 4,038 కోట్లకు క్షీణించగా.. పేపర్ బోర్డులు, ప్యాకేజింగ్ టర్నోవర్ స్వల్ప వృద్ధితో రూ. 2,220 కోట్లకు చేరింది.  ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 419 వద్ద ముగిసింది.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
