సెప్టెంబర్ క్వార్టర్‌లో 8.2 శాతం వృద్ధి
జూన్ త్రైమాసికంలో 7.8 శాతమే
పరిశ్రమలు, సేవల రంగాల్లో పటిష్ట పనితీరు
అంచనాలకు మించి ఆర్థిక దూకుడు
న్యూఢిల్లీ: అంచనాలను మించి, విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తూ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలోనూ (క్యూ2) బలమైన పనితీరు చూపించింది. ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయిలో 8.2 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతం కంటే మరింత బలపడింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గనుండడంతో డిమాండ్ పుంజుకుంటుందన్న అంచనాల మేరకు పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడం, పండుగల సీజన్‌లో పెరిగిన వినియోగ వ్యయాలు వృద్ధికి అండగా నిలిచాయి. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ2లో జీడీపీ వృద్ధి 5.6 శాతంగా ఉండడం గమనార్హం. 2023–24 జనవరి–మార్చి క్వార్టర్‌లో నమోదైన 8.4 శాతం పూర్వపు గరిష్ట వృద్ధిగా ఉంది.
మరోసారి భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాలంలో 4.8% వృద్ధితో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఎన్‌ఎస్‌వో సెప్టెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో జీడీపీ వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 6.1% కంటే ఎంతో మెరుగుపడింది.
ముఖ్యాంశాలు..
→ జీడీపీలో 57 శాతం వాటా కలిగిన ప్రైవేటు తుది వినియోగం 7.9 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 6.4 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి చెందడం గమనార్హం.
→ తయారీ రంగంలో 9.1% స్థాయిలో బలమైన వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమా సికంలో ఈ రంగంలో వృద్ధి 2.2 శాతమే. ఆగస్ట్ 15న స్వాతంత్య్రదినం సందర్భంగా ప్రధాని జీఎస్‌టీ సంస్కరణలను ప్రకటించడంతో.. పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడం ఇందుకు దారితీసింది.
→ సేవల రంగం లోనూ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నిపుణుల సేవలు సహా) 10.2 శాతానికి వృద్ధి బలపడింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసింకలో వృద్ధి 7.2 శాతంగా ఉంది.
→ దేశంలో ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సాగు రంగం 4.1 శాతం వృద్ధిని చూపించడం గమనార్హం.
→ ప్రభుత్వ వ్యయాలు క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోలి్చతే 2.7 శాతం తగ్గాయి. జూన్ త్రైమాసికంలో 7.4 శాతం పెరగడం గమనించొచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు క్యూ2లో 31 శాతం పెరిగాయి. జూన్ క్వార్టర్‌లో 52 శాతం పెరుగుదల కంటే తక్కువే.
→ రియల్ జీడీపీ (స్థిర ధరల వద్ద/ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.48.63 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 క్యూ2లో రూ.44.94 లక్షల కోట్లతో పోలి్చతే 8.2 శాతం పెరిగింది.
→ నామినల్ జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.85.25 లక్షల కోట్లుగా ఉంది. 2024–25లో రూ.78.40 లక్షల కోట్ల కంటే 8.7 శాతం వృద్ధి చెందింది.
→ వ్యత్యాసాలు ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు పెరిగాయి. వివిధ నమూనాల ఆధారంగా జీడీపీ గణనలో వచి్చన వ్యత్యాసాలు ఇవి.
ఎంతో ప్రోత్సాహకరం
2025–26 క్యూ2లో 8.2 శాతం వృద్ధి రేటు అన్నది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మేము చేపట్టిన సంస్కరణలు, వృద్ధి అనుకూల విధానాల ఫలితాన్ని సూచిస్తోంది. అంతేకాదు మన దేశ వ్యాపార సంస్థలు, ప్రజల కృషిని తెలియజేస్తోంది. మా ప్రభుత్వం సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రతి పౌరుడి జీవనాన్ని మరింత సులభతరం చేస్తుంది
– ప్రధాని నరేంద్ర మోదీ
దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం
జీడీపీ అంచనాలు బలమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తున్నాయి. 2025–26 క్యూ2లో 8.2 శాతం రియల్ జీడీపీ వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నిలకడైన ద్రవ్య స్థిరీకరణ, లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ పెట్టుబడులు ఉత్పాదకతను బలోపేతం చేశాయి. వ్యాపార సులభతర నిర్వహణను మెరుగుపరిచాయి. ప్రధాని ఆధ్వర్యంలో ఈ వృద్ధి జోరును కొనసాగించేందుకు, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి అనుకూలించే
సంస్కరణలను చేపట్టేందుకు కట్టుబడి ఉంది.
– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


