భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్‌లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది.
డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్‌లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్‌లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్‌ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్‌లెట్‌లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.
ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్


