బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు..
బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు..
నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్‌లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె.
సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్‌కుమార్ చెబుతున్నారు.


