చంపుతానని బెదిరించి.. అన్నంత పనిచేసి | Peddapalli District Incident | Sakshi
Sakshi News home page

చంపుతానని బెదిరించి.. అన్నంత పనిచేసి

Feb 22 2026 11:40 AM | Updated on Feb 22 2026 11:40 AM

Peddapalli District Incident

15 ఏళ్ల తర్వాత పగతీర్చుకున్న తండ్రి 

 తన కుమారుడి చావుకు కారణమని వ్యక్తి దారుణ హత్య 

వివాహ వేడుకకు హాజరై ప్రాణాలు  కోల్పోయిన కొమురయ్య  

రామగిరి(మంథని): తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి ఇద్దరు కారణమని, ఎప్పటికైనా వారిద్దరినీ చంపుతానని సుమారు 15ఏళ్లపాటు బెదిరిస్తూ వచ్చిన ఆ వ్యక్తి అనుకున్నట్లే మొలుగూరి కొమురయ్య(58)ను హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని బంధువుల వివాహ వేడుకకు హాజరైన కొమురయ్యను  దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్య, మొలుగురి సత్తయ్య అన్నదమ్ములు. కొమురయ్య బేగంపేటలో ఉంటూ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 

సత్తయ్య సుల్తానాబాద్‌ మండలం నారాయణరావుపల్లిలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సత్తయ్య బావమరిది బుర్ర రాజకొమురయ్య కొడుకు తిరుపతి 2011లో కమాన్‌పూర్‌ మండలం గుండారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే, తన కుమారుడికి కొమురయ్య, సత్తయ్య యాక్సిడెంట్‌ చేయించారని రాజకొమురయ్య అప్పట్నుంచి అనుమానిస్తూనే ఇద్దరితోనూ గొడపడుతూ వస్తున్నాడు. ఎలాగైనా ఇద్దరినీ చంపుతానని బెదిరించేవాడు. ఈనేపథ్యంలోనే సెంటినరీకాలనీలోని కమ్యూనిటీహాల్‌లో శనివారం జరిగే బంధువుల వివాహ వేడుకలకు కొమురయ్య, సత్తయ్య కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న రాజకొమురయ్య హఠాత్తుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా కుడి చేతికి గాయమైంది.

 అక్కడే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు యత్నించగా అతడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య ఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర రాజకొమురయ్య తన భర్తపై దాడి చేశాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బంధువుల వివాహ వేడుకల్లో విగతజీవిగా పడిఉన్న కొమురయ్యను చూసి స్థానికులు కంటతడిపెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement