గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి నిరాశ పరిచిన నిఖత్... ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా సిద్ధమవుతోంది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ బాక్సర్... గాయం నుంచి కోలుకొని రింగ్‌లో మళ్లీ మెరిపిస్తోంది. తాజాగా జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్ తన పంచ్ పవర్‌తో ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించేందుకు సిద్ధమైన ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్... సీజన్ మొత్తం ఇదే జోరు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది.
అడ్డంకులు ఎదురైనా..
‘క్రీడల్లో ఎత్తుపల్లాలు సహజం. ఒక అథ్లెట్ అన్నివేళలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోవచ్చు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. కొన్నికొన్ని సార్లు అడ్డంకులు ఎదురవుతాయి.
అప్పుడే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. దాన్ని గుర్తించి అధిగమించగలిగితే ఎదురుండదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నించడం ముఖ్యం’ అని నిఖత్ వెల్లడించింది.
ఆటుపోట్లను దాటుకుంటూ...
2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలతో నిఖత్ దుమ్మురేపింది. దీంతో విశ్వక్రీడల్లో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడగా... పారిస్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి చేరింది.
నిరాశ చెందాను
ఆ తర్వాత నిఖత్‌కు మోకాలి గాయం అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె గతేడాది జూలైలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి ఒలింపిక్ పతక విజేత చేతిలో ఓడింది. ‘ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ చేతిలో ఓడాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉత్తచేతులతో వచ్చినందుకు నిరాశ చెందాను’ అని ఆమె వెల్లడించింది.
తనకు ఎదురుదెబ్బలు సహజమే అని... జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఈ స్థాయికి చేరినట్లు 29 ఏళ్ల నిఖత్ చెప్పింది. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇదే బరువు కేటగిరీలో ఉన్న నిఖత్... ఎన్నో ఏళ్ల పాటు ఓపికగా ఎదురుచూసింది. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి చేరింది.
ఒలింపిక్ చాంపియన్ కావాలని
‘నా జీవితం అంత సులువైందేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డాను. అన్నీ సజావుగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రపంచ చాంపియన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. దాని కోసం నా యావత్ శక్తిని ధారపోశాను.
దాని వల్లే వరల్డ్ చాంపియన్‌గా ఎదగగలిగాను. ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కావాలని అంతే తపనతో కోరుకుంటున్నా. ముందు మనపై మనకు నమ్మకం లేకుంటే... అది వాస్తవ రూపం దాల్చదు. దాని కోసం కోచ్ సన్నీ గెహ్లావత్‌తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నా’ అని నిఖత్ వివరించింది.
తప్పులను సరిదిద్దుకుంటూ...
లాస్ ఏంజెలిస్ క్రీడల్లో నిఖత్‌ను చాంపియన్‌గా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నామని సన్నీ పేర్కొన్నాడు. ‘ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. చిన్న చిన్న తప్పులను గుర్తించి వాటిని అధిగమించేందకు ప్రయత్నిస్తున్నాం. కౌంటర్ అటాక్ విషయంలో మరింత మెరుగయ్యే ప్రయత్నాలు సాగుతున్నాయి. రింగ్‌లో నిఖత్ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌ను వినియోగిస్తుంది.
దాంట్లో కొన్ని మెళకువలు నేర్చుకుంటోంది. టెక్నిక్‌తో పాటు వ్యూహాలపై దృష్టి పెట్టాం’ అని సన్నీ గెహ్లావత్ చెప్పాడు. 2028 ఒలింపిక్స్ సమయానికి నిఖత్ వయసు 32 ఉండనుంది కాబట్టి అందకు తగ్గట్లు శిక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.
2026 తనకెంతో ముఖ్యమని... ఆరంభంలోనే జాతీయ చాంపియన్‌గా నిలిస్తే... ఏడాదంతా అదే జోరు కొనసాగించవచ్చని నిఖత్ వెల్లడించింది. అదంత సులువు కాకపోయినా... దేశానికి పతకాలు సాధించి పెట్టాలనే తపనే తనను ముందుకు తీసుకెళ్తుందని తెలంగాణ బాక్సర్ పేర్కొంది.
చదవండి: WPL 2026: డిక్లెర్క్ ధమాకా


