నోయిడా: కారుతో సహా నీటి గుంతలో పడి మరణించిన నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సహాయక బృందాలు గాలిస్తున్న దృశ్యాలతో పాటు.. దట్టమైన మంచులో నీటిపై ఆ వ్యక్తి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచిన వెలుగు కనిపిస్తోంది. రక్షణ సిబ్బంది అతడిని కంగారు పడొద్దంటూ ధైర్యం చెబుతున్న మాటలు కూడా వీడియోలో వినిపించాయి. జనవరి 16 రాత్రి 27 ఏళ్ల యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో బయటకొచ్చింది.
గురుగ్రామ్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా... ఇంటికి తన కారులో తిరిగి వస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లో నిర్మాణ స్థలం దగ్గర తవ్విన లోతైన గోతిలో కారు పడిపోయింది. అతను దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం అభ్యర్థించాడు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. యువరాజ్ తండ్రి రాజ్‌కుమార్ మెహతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం కారును బయటకు తీశారు.
Another saddening video of 27 year old techie shows mediocre efforts by specialised authorities ultimately leading to his death in Noida's Sector 150.
PS: The white dot you see in this video is the flashlight from victim Yuvraj Mehta's phone seeking help! pic.twitter.com/2OT0NR5RG6— Harsh Trivedi (@harshtrivediii) January 22, 2026
లోటస్ గ్రీన్స్ కన్స్ట్రక్షన్, ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ సంస్థలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, ఆ నీటి గోతి వల్ల జరిగిన మరణానికి వీరిని బాధ్యులను చేస్తూ కేసు నమోదైంది. 2014లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్‌లో భారీ యంత్రాలతో గోతిని తవ్వి, ఏళ్ల తరబడి నీటితో అలాగే వదిలేశారు. దీంతో నీటితో నిండిపోయి చెరువులా మారింది. బురద నీరు, చెత్తాచెదారంతో కలుషితమైంది. ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది.


