- బెంగళూరును గెలిపించిన దక్షిణాఫ్రికా బ్యాటర్
- 44 బంతుల్లో 63 నాటౌట్
- 3 వికెట్లతో ముంబై ఓటమి
ముంబై: నదైన్ డిక్లెర్క్... ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగిన ఈ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేసిన ఈ బెంగళూరు ప్లేయర్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగింది. తమ జట్టుకు ఓటమి ఖాయమైన దశలో దూకుడైన బ్యాటింగ్‌తో గెలిపించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా... డిక్లెర్క్ వరుసగా 6, 4, 6, 4 బాది ముగించింది.
శుక్రవారం జరిగిన నాలుగో సీజన్ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజన (25 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్), నికోలా కేరీ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 49 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. డిక్లెర్క్ (4/26)కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డిక్లెర్క్ (44 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగింది.
నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
సజన దూకుడు...
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్ ‘మెయిడిన్ ఓవర్’తో మొదలు కావడం విశేషం. లారెన్ బెల్ వేసిన ఈ ఓవర్లో అమేలియా కెర్ (4) ఒక్క పరుగు కూడా తీయలేకపోయింది. అయితే లిన్సే స్మిత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లతో కమలిని ధాటిని ప్రదర్శించింది. స్మిత్ తర్వాతి ఓవర్లో కూడా కమలిని 2 ఫోర్లు కొట్టగా, నాట్ సివర్ (4) మరో ఫోర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై 34 పరుగులు చేసింది. పవర్‌ప్లే తర్వాత కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి మూడో వికెట్‌కు 28 పరుగులు జోడించారు.
వీరిద్దరిని నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ దశలో కేరీ, సజన కలిసి జట్టును ఆదుకున్నారు. 2, 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద సజన ఇచి్చన సులువైన క్యాచ్‌లను హేమలత, సయాలీ వదిలేయడం కూడా ముంబైకి కలిసొచి్చంది. రాధ యాదవ్ వేసిన ఓవర్లో కేరీ ఫోర్ కొట్టగా, ఆ తర్వాత సజన 6, 4 బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత సజన మరింత చెలరేగిపోయింది. అరుంధతి, డిక్లెర్క్ వేసిన వరుస ఓవర్లలో కలిపి 9 బంతుల వ్యవధిలో ఆమె 5 ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు చివరి ఓవర్లో వీరిద్దరిని ఆర్‌సీబీ నిలువరించగలిగింది. తొలి బంతికి సజన, ఐదో బంతికి కేరీని డిక్లెర్క్ అవుట్ చేయగా... ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి.
కీలక భాగస్వామ్యం...
ఛేదనలో బెంగళూరుకు గ్రేస్ హారిస్ (12 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) చక్కటి బౌండరీలతో మెరుగైన ఆరంభాన్నే అందించారు. కేరీ వేసిన మూడో ఓవర్లో వీరిద్దరు మరింత ధాటిగా ఆడారు. స్మృతి 2 ఫోర్లు కొట్టగా, హారిస్ సిక్స్, ఫోర్ బాదింది. ఫలితంగా ఈ ఓవర్లో 20 పరుగులు లభించాయి. అయితే తొలి వికెట్‌కు 23 బంతుల్లో 40 పరుగులు జోడించిన అనంతరం ఏడు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత కూడా బెంగళూరు బౌలర్లు పట్టు చేజారనీయలేదు. కేవలం మూడు పరుగుల వ్యవధిలో హేమలత (7)ను అమన్‌జోత్ అవుట్ చేయగా...అమేలియా తన మొదటి ఓవర్లోనే రాధ యాదవ్ (1), రిచా ఘోష్ (6)లను వెనక్కి పంపించింది. ఆ తర్వాత డిక్లెర్క్, అరుంధతి రెడ్డి (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో అరుంధతి, శ్రేయాంక (1) అవుటైనా... డిక్లెర్క్ ఒంటి చేత్తో గెలిపించింది. 4, 36, 40 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న ఆమె దీనిని పూర్తిగా వాడుకుంది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: అమేలియా (సి) అరుంధతి (బి) బెల్ 4; కమలిని (బి) శ్రేయాంక 32; నాట్ సివర్ (స్టంప్డ్) రిచా (బి) డిక్లెర్క్ 4; హర్మన్‌ప్రీత్ (సి) రిచా (బి) డిక్లెర్క్ 20; నికోలా కేరీ (సి) హేమలత (బి) డిక్లెర్క్ 40; సజన (సి) స్మతి (బి) డిక్లెర్క్ 45; అమన్‌జోత్ (నాటౌట్) 0; పూనమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–21, 2–35, 3–63, 4–67, 5–149, 6–154.
బౌలింగ్: బెల్ 4–1–14–1, లిన్సే 2–0–23–0, అరుంధతి 4–0–37–0, డిక్లెర్క్ 4–0–26–4, శ్రేయాంక 4–0–32–1, రాధ 2–0–21–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (సి) షబ్నిమ్ (బి) నాట్ సివర్ 25; స్మృతి (సి) పూనమ్ (బి) షబి్నమ్ 18; హేమలత (ఎల్బీ) (బి) అమన్‌జోత్ 7; రిచా (సి) కేరీ (బి) అమేలియా 6; రాధ (బి) అమేలియా 1; డిక్లెర్క్ (నాటౌట్) 63; అరుంధతి (సి) అమేలియా (బి) కేరీ 20; శ్రేయాంక (బి) కేరీ 1; ప్రేమ (నాటౌట్) 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–40, 2–47, 3–62, 4–63, 5–65, 6–117, 7–121.
బౌలింగ్: నాట్ సివర్ 4–0–47–1,
షబి్నమ్ 4–0–26–1, కేరీ 4–0–35–2, అమన్‌జోత్ 3–0–18–1, అమేలియా కెర్4–0–13–2, సైకా 1–0–13–0.


