నోయిడాలో సెక్టార్-150లో నీటితో నిండిన గోతిలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ గోతిలో నీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రాజెక్టు అవసరమని ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ మూడేళ్ల క్రితమే నోయిడా అథారిటీకి లేఖ రాసింది. కానీ.. ఆ లేఖ ఫైళ్లలోనే మరుగునపడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరకు గత శుక్రవారం రాత్రి యువరాజ్‌ను ఆ నీటి గుంత బలితీసుకుంది.
పీటీఐ కథనం ప్రకారం.. 2023లో యూపీ నీటిపారుదల శాఖ నోయిడా అథారిటీకి ఒక అధికారిక లేఖ పంపింది. వర్షపు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా, దానిని హిండన్ నదిలోకి మళ్లించడానికి అక్కడ 'హెడ్ రెగ్యులేటర్లు' ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. కానీ, ఆ లేఖపై నోయిడా అథారిటీ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై అడిగితే తమకు అలాంటి లేఖ ఏదీ అందలేదని ఒక అధికారి పీటీఐకి తెలిపాడు.
గత శుక్రవారం(జనవరి 23) రాత్రి యువరాజ్ గురుగ్రామ్‌లోని తన ఆఫీసు నుంచి కారులో నోయిడా సెక్టార్ 150లోని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండగా, మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన లోతైన గోతిలో పడిపోయింది. ఆ గొయ్యి కేవలం వర్షపు నీటితోనే కాకుండా, సమీపంలోని నివాస ప్రాంతాల డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉంది.
కారు గోతిలో పడగానే యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేశాడు. సాయం కోసం అభ్యర్థించాడు. వెంటనే తండ్రి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చినా దట్టమైన మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. యువరాజ్ తన ఫోన్ టార్చ్ వెలిగించి సుమారు 90 నిమిషాల పాటు (అర్ధరాత్రి 1.30 గంటల వరకు) సహాయం కోసం కేకలు వేశాడని, ఆ తర్వాతే మునిగిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అతని మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల సిట్ బృందాన్ని నియమించింది. నిర్లక్ష్యం వహించినందుకు నోయిడా అథారిటీ సీఈఓను బదిలీ చేసి వెయిటింగ్ లిస్టులో పెట్టింది. కాగా, యువరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు విష్‌టౌన్ ప్లానర్స్, లోటస్ గ్రీన్స్ సంస్థలపై కేసు నమోదైంది. అయితే, లోటస్ గ్రీన్స్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది. తాము ఆ స్థలాన్ని 2019-20లోనే 'గృహప్రవేశ్ గ్రూప్'కు బదిలీ చేశామని, వారే బేస్మెంట్ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేశారని క్లారిటీ ఇచ్చింది. అక్కడ కనీసం బారికేడ్లు గానీ, వెలుతురునిచ్చే రిఫ్లెక్టర్లు గానీ లేవని.. తన కుమారుడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదంటూ యువరాజ్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.


