దుబాయ్‌లో షాపింగ్ అంటే ఈమాత్రం ఉండాలి మరి
కెమెరా క్లోజప్‌లో ఒక హైటెక్ టచ్ స్క్రీన్. పక్కనే కళ్లు జిగేల్మనే రంగురంగుల దీపాలు. బయట వేలాదిమంది సందడి చేసే షాపింగ్ మాల్. కానీ అందులోని ఓ చిన్న
గదిలోకి వెళ్లగానే అంతా మాయా ప్రపంచం. మీరు ఎంపిక చేసే సంగీతం బీట్‌కు తగ్గట్టుగా గోడలు రంగులు మారిపోతాయి. అద్దం ముందు నిల్చున్నప్పుడు మీరొక సామాన్య కస్టమర్‌లా.. కాదుకాదు.. ఏదో గ్లామర్ వరల్డ్ సూపర్ స్టార్‌లా ఫీలైపోతారు..
దుబాయ్‌లోని ప్రసిద్ధ హెచ్ అండ్ ఎం స్టోర్‌లో సార్థక్ సచ్‌దేవా అనే భారతీయ యువకుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా మనం ట్రయల్ రూమ్‌లోకి వెళ్తే బట్టలు వేసుకుని చూసుకుని వచ్చేస్తాం. కానీ ఈ స్టైలిష్ డ్రెస్సింగ్ రూమ్ మాత్రం వేరే లెవల్. సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన ఈ వీడియో, షాపింగ్ అనుభవాన్ని సాంకేతికత ఎలా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపుతోంది.
నాలుగు రకాల మూడ్స్..
ఆ ట్రయల్ రూమ్ లోపల ఒక టచ్ స్క్రీన్ ప్యానెల్ ఉంటుంది. అందులో నాలుగు ఆప్ష న్లు ఉంటాయి. ఫుల్ ఎనర్జీతో కూడిన సంగీతం.. దానికి తగ్గట్టుగా వేగంగా మారే కాంతి కిరణాలు. ట్రయల్ రూమ్ లోని టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా యూజర్లు తమకు నచి్చన సంగీతాన్ని ఎంచుకోవచ్చు. వాటిలో హైప్, వైబ్, చిల్, లోకల్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
వైబ్: పార్టీ మూడ్‌ని సెట్ చేసే విజువల్స్.
చిల్: ప్రశాంతమైన సంగీతం, ఆహ్లాదకరమైన రంగులు.
లోకల్: అక్కడి నేటివిటీని ప్రతిబింబించే సంగీతం.
తాకితే చాలు మతిపోతోంది
సార్థక్ ఒక్కొక్క ఆప్షన్‌ని టచ్ చేస్తుంటే.. ఆ గది గోడలపై ఉన్న స్క్రీన్లు డైనమిక్ విజువల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సంగీతం మారిన ప్రతిసారీ లైటింగ్ సింక్ అవుతూ సెకన్లలో గది వాతావరణాన్ని మార్చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘దుబాయ్ ఎక్కడో ఉందనుకున్నాం.. ఇది నెక్సŠట్ లెవల్‘ అని ఒకరంటే.. ‘నాకు ఇలాంటి ట్రయల్ రూమ్ దొరికితే అసలు బయటికే రాను’.. అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు.
అందమైన అనుభవాల గది
సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందంటే.. బట్టలు సరిపోయాయో లేదో చూసుకునే ఒక సాదాసీదా గదిని కూడా ఒక మధుర సంగీతానుభవాల లోకంగా మార్చేసింది. షాపింగ్ అంటే కేవలం వస్తువు కొనడం కాదు, అదొక అందమైన.. అద్భుతమైన జ్ఞాపకం కూడానని దుబాయ్ మరోసారి నిరూపించింది. మీరు కూడా ఇలాంటి ట్రయల్ రూమ్ లోకి వెళ్తే మొదట ఏ సంగీతం ప్లే చేస్తారో ఊహించుకోండి..!
– సాక్షి, నేషనల్ డెస్క్


