గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. తాజాగా యూఏఈలోని అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఇచ్చిన తీర్పు అందరిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించినందుకు కోర్టు ఏకంగా 25,000 దిర్హామ్‌లు (సుమారు రూ. 5.6 లక్షలు) జరిమానా విధించింది.
ఏమి జరిగిందంటే?
ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తనకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో బీజీగా ఉండగా.. మరొకరు అతడికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా వాటిని తన స్నాప్‌చాట్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో సదరు వ్యక్తి తనకు ప్రైవసీకి భంగం కలిగించరాని, మనస్తాపానికి గురయ్యానని కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు నిందితుడికి 25,000 దిర్హామ్‌లు ఫైన్ విధించింది.
అదేవిధంగా నిందితుడి స్నాప్‌చాట్ అకౌంట్‌ను వెంటనే రద్దు చేయాలని, ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. కాగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం లేదా వాటిని ప్రచారం చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లు' గా పరిగణిస్తారు.


