కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్ అనిపించు కుంటోంది. ఒకపుడు డ్రైవింగ్‌ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్‌ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్ వచ్చిందంటే.. రయ్ రయ్‌మని దూసుకుపోవాల్సిందే.
ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ, లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉండటం విశేషం. విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు.
‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మ
కేరళలో డ్రైవింగ్ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు శిక్షణ
1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన సమయంలోనే A2Z ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్‌మెంట్స్‌కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్ కరియర్‌ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది. రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్‌లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్‌ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్‌ను పొందింది. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
70 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని కూడా అంటారు.


