బంగారం, వెండి లోహాలపై ఎప్పుడూ బుల్లిష్‌గా ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ( Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై బలమైన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘యేయ్.. వెండి 80 డాలర్లు దాటిందోచ్’ అంటూ ధరల పెరుగుదల ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశారు.
ఇటీవల వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్లు దాటడంతో ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోతుందా అనే పెట్టుబడిదారుల సందేహాలకు కియోసాకి (Robert Kiyosaki ) సమాధానమిచ్చారు. ‘వెండి కొనడానికి ఇప్పటికే ఆలస్యమైందా?’ అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా “లేదు” అని చెప్పారు. ధరలు 100 డాలర్ల స్థాయికి (ఔన్స్‌కు) చేరుకునే వరకు వెండిని కొనుగోలు చేస్తూనే ఉంటానని, ఆ తర్వాత పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు.
కఠిన ఆస్తులు (హార్డ్ అసెట్స్), ఫియాట్ కరెన్సీ విలువ క్షీణత, ద్రవ్యోల్బణ ప్రమాదాలపై తరచూ హెచ్చరికలు చేసే కియోసాకి.. పెట్టుబడిలో క్రమశిక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ “పందులే బలుస్తాయి. మాంసం కోసం వాటినే వధిస్తారు” అనే ప్రసిద్ధ నానుడిని ప్రస్తావించారు. అంటే, దురాశతో కాకుండా నియంత్రిత రిస్క్‌తో లాభాలు సాధించాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు ఆయన గత అంచనాలకు కొనసాగింపుగానే వచ్చాయి. 2025 చివర్లో వెండి ఔన్సుకు 72 డాలర్లు దాటినప్పుడు, దానిని “బంగారం, వెండి పోగు చేసేవారికి గొప్ప వార్త”గా అభివర్ణించిన కియోసాకి, అదే సమయంలో డబ్బును పొదుపుపైనే ఆధారపడే పెట్టుబడిదారులకు ఇది “చెడు వార్త” అని హెచ్చరించారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్లు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. పారిశ్రామిక డిమాండ్, సేఫ్-హేవెన్ పెట్టుబడులు, అలాగే గ్లోబల్ ఆర్థిక అస్థిరత కలయికే వెండి ధరలను పైకి నడిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
10-11-2026
Silver over $80…..yay
Is it too late to buy silver?
I say “No.”
I would buy silver up to $100…. Then wait and see.
Always remember:
“Pigs get fat.
Hogs get slaughtered.”— Robert Kiyosaki (@theRealKiyosaki) January 11, 2026


