ఒకనాడు కోట గోడలలో విలాసంగా వెలిగింది నేడు, అతివల వస్త్ర సంపదలో సుసంపన్నంగా మెరుస్తోంది.పట్టుకుచ్చులాంటి మెత్తదనం, మది దోచే మెరుపుతో మఖమల్ పేరున్న వెల్వెట్ ఈ వింటర్ సీజన్‌లో రారాజులా విరాజిల్లుతుంది. బాలీవుడ్ తారలు వింటర్ సీజన్‌లో వెల్వెట్‌ను ధరించడంలో ముందుంటారు. అందుకు ముందుగా టబు వెల్వెట్ అనార్కలీలో రాచరికపు హుందాతనంతో కనిపించగా ఇప్పుడు యామి గౌతమ్ ఆకుపచ్చని వెల్వెట్ శారీలో గాంభీర్యంగా కనివిందు చేస్తుంది.సల్వార్ సూట్‌లు, లాంగ్ ఓవర్‌కోటులు, సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీతో వెల్వెట్ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్ మార్కులు కొట్టేస్తూనే ఉంది. ఈ శీతాకాలపు వివాహాలు, పండగ వేడుకలలో అత్యంత ఇష్టమైన ఎంపికగా అతివల మనసును ఆకట్టుకుంటోంది. పచ్చ, ఆకుపచ్చ, నెమలిపింఛం రంగు, రిచ్ బ్రౌన్, బ్లాక్.. వంటి టోన్ షేడ్స్ సెలబ్రిటీ వార్డ్‌రోబ్‌లను రిచ్‌గా మెరిపిస్తున్నాయి.
వెల్వెట్‌కి ఈ సీజన్‌లో మళ్లీ ఊపిరిపోస్తున్నాం అంటే ఒక్క విలాసం గురించే కాదు. మనలోని భావోద్వేగ ప్రతిధ్వనిని కూడా బయటకు వెదజల్లుతుంది. ప్రాచీన ప్రపంచ చక్కదనాన్ని చూపెడుతుంది. చలికాలం మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇండోర్ లైటింగ్‌లో అందమైన ఫొటోలకు మంచి లుక్ ఇస్తుంది. ఎంబ్రాయిడరీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ మళ్లీ గొప్పగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ వెలుగులో నిలిచిపోతుంది.
ఈ ఏడాది వింటర్ సీజన్‌కి హీనా కొచ్చర్ రూపొందించిన వెల్వెట్ కలెక్షన్ రాయంచలా వచ్చేసింది. బ్రౌన్ అనార్కలీలో టబు ధరించిన వెల్వెట్ రాయల్టీకి ప్రతిరూపంగా నిలిచింది. ధరించిన డ్రెస్‌కు తగినట్టు ఇయర్ హ్యాంగింగ్స్, పాట్లి బ్యాగ్‌తో మ్యాచ్ చేసింది. డ్రెస్ మరింత వైభవంగా వెలిగేలా జుట్టును స్టైల్ చేసింది.
యామి గౌతమి ఈ ట్రెండ్‌కు రీఫ్రెషింగ్ మినిమలిజాన్ని తీసుకువచ్చింది. దేవనాగరి సెట్ చేసిన ఈ అద్భుతమైన ఆకుపచ్చ వెల్వెట్ చీర సుతిమెత్తని అలలకు నిదర్శంగా నిలిచింది. తక్కువ మేకప్, ఆభరణాలతో అలంకరించింది. ఆమె స్టైలింగ్ అంతా ఫ్యాబ్రిక్ గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది.
డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్‌లో శోభిత ధూళిపాళ మెరిసిపోయారు. అందుకు తగినట్టుగా ఉండే మేకప్, హెయిర్ స్టైల్ కంఫర్ట్‌ని సూచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
(చదవండి: నానోతో పాత ఫొటోలు కొత్తగా!)


