టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవడానికి తానే కారణమని ఓ యువతి అంగీకరించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశానని, తనకు మరో ఉద్దేశం ఏదీ లేదని వెల్లడించింది. పలాష్ ముచ్చల్‌తో జరిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను బయటపెట్టింది తానేనని తెలిపింది. పలాష్ ఎలాంటి వాడో తెలియాలన్న భావనతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే పలాష్‌తో 4 నెలల క్రితం చాటింగ్ చేశానని, అతడి పెళ్లి ఆగిపోవడానికి వీటికి సంబంధం లేదని తెలిపింది. అందరూ అనుకుంటున్నట్టుగా తాను కొరియోగ్రాఫర్ కాదని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
''స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమైన చాట్‌లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. పలాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మధ్య చాట్‌లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (పలాష్ ముచ్చల్) గురించి బహిర్గతం చేశాను.
నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. పలాష్‌తో చేసిన చాట్‌ను బయటపెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్యతిరేకత రావడంతో నా సోషల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివచ్చింది. పలాష్‌తో జరిపిన చాట్‌లను గమనిస్తే.. నేను తప్పు చేయలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మహిళకు అన్యాయం నేను చేయలేదు. దయచేసి నన్ను టార్గెట్ చేయవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.
చదవండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం
కాగా, స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో మేరీ డికోస్టా అనే యువతి పేరుతో అనధికారిక చాటింగ్ స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫలితంగా సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ (Palash Muchhal) కుటుంబాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


