ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్ సెమీస్‌లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.
చాంపియన్ జట్టు ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడబడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.
అక్కాచెల్లెళ్ల మాదిరి
భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్‌మెంట్ విషయాన్ని జెమీమా సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే స్మృతి వెల్లడించింది.
ఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, సంగీత్ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్ లీక్ కావడం సందేహాలకు తావిచ్చాయి.

ఆగిన వివాహం
మరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్ బాష్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమైంది.
స్మృతి కోసం సంచలన నిర్ణయం
డబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్‌లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.
హోబర్ట్ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్‌లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా ఈ సీజన్‌లో హీట్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్ హ్యారికేన్స్‌తో మ్యాచ్ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్‌లో భారత్ తరఫున డబ్ల్యూబీబీఎల్ ఆడిన ఏకైక ప్లేయర్ జెమీమా కావడం విశేషం.
చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!


