సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇపో వేదికగా బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. కొరియాపై తొలి మ్యాచ్‌లో 1–0తో నెగ్గిన భారత్... బెల్జింయతో జరిగిన రెండో మ్యాచ్‌లో 2–3తో ఓడిపోయింది.
మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున సెల్వం కార్తీ (7వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (21వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (39వ నిమిషంలో), కెప్టెన్ సంజయ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా
మలేసియా జట్టుకు ఫైజల్ సారి (13వ నిమిషంలో), ఫిత్రి సారి (36వ నిమిషంలో), మర్హాన్ జలీల్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా సంజయ్ గోల్ చేసి భారత్‌ను 4–3తో ఆధిక్యంలో నిలిపాడు.
ఆ తర్వాత ఈ ఏడు నిమిషాలు భారత రక్షణపంక్తి మలేసియా ఆటగాళ్లను నిలువరించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని ఖాయం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, రెండు పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. నాలుగు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని... రెండు పెనాల్టీ స్ట్రోక్‌లలో ఒక దానిని భారత్ సద్వినియోగం చేసుకుంది.
ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక గురువారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది.


