దేశ అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకోండి
పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
రాజ్‌కోట్: ప్రపంచమంతటా అస్థిర పరిస్థితు లు, ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, భారత్ లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్థిరత్వం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలో వ్యాపార ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు.
ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వైబ్రాంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు.
భారత్ పట్ల ప్రపంచ దేశాలు ఆకాంక్షలు నానాటికీ పెరుగుతున్నాయని, తాజా గణాంకాలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో మధ్య తరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని, వారి కొనుగోలు శక్తి పెరుగుతోందని చెప్పారు. తద్వారా వ్యాపార అభివృద్ధికి అవకాశాలు సైతం అదే స్థాయిలో పెరుగుతు న్నాయని వెల్లడించారు. మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. వైబ్రాంట్ గుజరాత్ సదస్సుకు దేశ విదేశీ పెట్టుబడిదారులు హాజరయ్యారు.


