సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్‌గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్‌కోచ్‌గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్‌గా గంభీర్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.
అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.
ద్రవిడ్‌కే ఆ క్రెడిట్
కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు టైటిల్‌కు అందించిన హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.
పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..
ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్‌మన్ గిల్‌కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.
ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి.
ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
సంధి కాలం
ఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్‌గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.
చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్‌లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.
కివీస్‌తో సిరీస్‌తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.
ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్‌లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.
బీసీసీఐ నిర్ణయం ఇదే!
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.
అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్‌కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు.
లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.
చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర


