దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సీజన్‌లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్ సమాల్ (14 బంతుల్లో 20), గౌరవ్ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.
176 పరుగులు
మిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్ సమంత్రయ్ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్ ఎస్ బరాల్ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్ రెండు, అంకిత్ శర్మ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బౌండరీల వర్షం
ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్ సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు సాధించాడు.
సంజూ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీ
మరోవైపు.. రోహన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.

ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్ జంటగా సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కావాల్సినంత ప్రాక్టీస్
కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.
చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం


