తిరువనంతపురం: కేరళలో శాంతి భద్రత పైకి సాధారణంగా కన్పిస్తున్నా లోపల అనేక ముప్పులు క్రమేపీ పెరుగుతున్నాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారనున్నాయని హెచ్చరించారు. మలయాళ పత్రిక కేరళ కౌముది ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
‘‘పీఎఫ్‌ఐ, జమాతె ఇస్లామీ, ఎస్‌డీపీఐ వంటి రాజకీయ పార్టీలు కేరళను సురక్షితంగా ఉండనిస్తాయా? ఇటువంటి బెడదలను ముందుగానే గుర్తించి, తొలగించడం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని’ అని అన్నారు. పీఎఫ్‌ఐ కేడర్ మొత్తాన్నీ కటకటాల్లోకి నెట్టేసి, దేశాన్ని తాము సురక్షితంగా ఉంచామని చెప్పారు. తెరవెనుక ఉన్న ముప్పులను తొలగించినప్పుడే కేరళ సురక్షితంగా ఉండగలదని అమిత్ షా అన్నారు. బీజేపీ వల్లనే అది సాధ్యమని చెప్పారు.
పద్మనాభుని సన్నిధిలో పూజలు
కేరళలో ఒక్క రోజు పర్యటనకు గాను శనివారం రాత్రి తిరువనంతపురం చేరుకున్న అమిత్ షా ఆదివారం ఉదయమే అనంత పద్మనాభుని ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ ధోవతి, సిల్కు శాలువాతో వచ్చిన అమిత్ షాకు ట్రావెన్‌కోర్ రాచ కుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమిత్ షాకు ఆలయ అధికారులు పద్మనాభస్వామికి అంకితమిచ్చే సంప్రదాయ విల్లును బహూకరించారు. .
కేరళ, బెంగాల్‌లలో ఒకేసారి ఎన్నికలు
అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా నూతనంగా ఎన్నికైన తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేరళలోనూ ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలో బంగారు తరుగు కేసుపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అసలైన దోషులను కాపాడేందుకు అధికార ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆలయ ఆస్తులనే కాపాడలేని వారు ప్రజల విశ్వాసాలను ఎలా పరిరక్షించగలరంటూ ప్రశ్నించారు.


