టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై.. టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. తనపై వేటు వేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసియా టీ20 కప్-2025 ద్వారా గిల్ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అభిషేక్ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్‌ను ఓపెనర్‌గా పంపారు. అయితే, వరుస మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడి ఖాతాలో ఒక్క టీ20 హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం.
అయినప్పటికీ సౌతాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ గిల్ (Shubman Gill).. తొలి మూడు మ్యాచ్‌లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగు (వర్షం వల్ల రద్దు), ఐదో టీ20కి గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో ప్రొటిస్‌తో ఐదో టీ20లో ఓపెనర్‌గా తిరిగి వచ్చి సంజూ మరోసారి సత్తా చాటాడు.
అనూహ్య రీతిలో వేటు
ఫలితంగా.. గిల్‌కు పెద్ద పీట వేస్తూ.. సంజూకు అన్యాయం చేశారన్న విమర్శలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ అయిన గిల్‌ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించింది. ఊహించని రీతిలో భవిష్య కెప్టెన్‌పై వేటు వేసి.. అక్షర్ పటేల్‌ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించింది.
ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో బిజీ కానుంది. జనవరి 11 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది.
అలా అయితే నన్నెవరూ ఆపలేరు కదా!
ఇందుకు స్పందిస్తూ.. ‘‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్. నా తలరాతలో రాసి ఉన్నదాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.
నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటిరాతలో రాసి ఉంటే.. నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు. నన్నెవరూ ఆపలేరు. ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. అయితే, సెలక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.


